News

మంచంపై ఉండే జయలలిత పాలన


అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరి 35 రోజుల నుంచి చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మంచంపై ఉండే పాలనను పర్యవేక్షిస్తున్నారు. వెంటిలేటర్‌ ఏర్పాటుతో గొంతు వద్ద ఏర్పడిన గాయం వల్ల ఆమె పెద్దగా మాట్లాడలేకపోతుండడంతో ల్యాప్‌టాప్‌ నుంచే ఆమె ప్రభుత్వానికి, పార్టీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సమాచారం. తను చెప్పదలచుకున్న అంశాలను సన్నిహితురాలు శశికళకు, ‘కీలక’మైన అధికారికి ల్యాప్‌టాప్‌ ద్వారా వివరిస్తున్నారు. ఆమె ఉద్దేశాలను గ్రహించిన శశికళ, ఆ ఉన్నతాధికారి తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు సమాచారం. కాగా అనారోగ్యం నుంచి కోలుకున్నందున తనను ఇంటికి పంపించేయాలని వైద్యులను జయ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్న లండన్ వైద్యుడు జాన్ రిచర్డ్‌ బీలే.. ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీపావళికి ముందే ఆమె ఇంటికి వెళ్లాలని భావిస్తున్నప్పటికీ ఇంకా కనీసం పది రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ప్రతి దీపావళికి ఇంట్లో లక్ష్మీపూజ నిర్వహించడం జయకు అలవాటు. ఇప్పుడు కూడా ఇంటికెళ్లాలని ఆమె భావిస్తున్నప్పటికీ వైద్యులు మాత్రం అందుకు అనుమతించడం లేదని తెలుస్తోంది.